Thursday, April 02, 2009
సమకాలీన ఉద్యమాన్ని విశ్లేషించిన దళిత ఉద్యమం –వెలుగు నీడలు
#fullpost{display:none;}
డా// పి.కేశవకుమార్ రచించిన దళిత ఉద్యమం –వెలుగు నీడలు పుస్తకాన్ని హైదరాబాదు ప్రెస్ క్లబ్ లో మార్చి ౩ వ తేదీ సాయంత్రం ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా ఆంద్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ కమీషనర్ ఎ.విద్యాసాగర్ ఐ.ఎ.ఎస్., పాల్గొన్నారు. పుస్తకాన్ని ప్రముఖ న్యాయవాది బొజ్జ తారకం ఆవిష్కరించారు.తెలంగాణ రచయితల వేదిక ప్రధాన కార్యదర్శి జూలూరి గౌరీ శంకర్ అధ్యక్షతన జరిగిన ఈ పస్తకావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రపదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ కమీషనర్ ఎ.విద్యాసాగర్ ఐ.ఎ.ఎస్., పాల్గొన్నారు
సభాధ్యక్షుని తొలిపలుకు పలుకుతున్న జూలూరి గౌరీశంకర్పుస్తకాన్ని దళిత ఉద్యమ నాయకులు, ప్రముఖ న్యాయవాది బొజ్జాతారకం ఆవిష్కరించారు. ఈ సభలో ముఖ్య వక్తలుగా ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటి అసోసియేట్ ప్రొఫెసర్ డా//కె. సత్యనారాయణ, ప్రముఖ దళిత కవి, విమర్శకులు కలేకూరి ప్రసాద్, హైదరాబాదు విశ్వవిద్యాలయం, తెలుగు అసిస్టెంటు ప్రొఫెసర్ డా// దార్ల వెంకటేశ్వరరావు, బహుజన కెరటాలు ప్రధాన సంపాదకురాలు, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, బుద్దిస్ట్ స్టడీస్ సెంటర్ లో అసోసియేట్ ప్రొఫెసర్ డా// చల్లపల్లి స్వరూపరాణి, ప్రముఖ విప్లవ కవి వరవరరావు, బహుజన కెరటాలు వ్యవస్థాపకుడు పల్నాటి శ్రీరాములు, ప్రముఖ కవయిత్రి మహెజబీన్ లు సభలో మాట్లాడారుదళిత ఉద్యమం –వెలుగు నీడలు గ్రంథావిష్కరణ దృశ్యం. చిత్రంలో వరుసగా కలేకూరి ప్రసాద్, డా//దార్ల వెంకటేశ్వరరావు,విద్యాసాగర్ ఐ.ఎ.ఎస్., జూలూరి గౌరీశంకర్, బొజ్జా తారకం, డా// సత్యనారాయణ తదితరులు ఉన్నారు.
సెంట్రల్ యూనివర్సిటి రీసెర్చ్ స్కాలర్ ధనరాజు స్వాగతం తో ప్రారంభమైన ఈ సభ భీమ్ కుమార్ వందన సమర్పణతో ముగిసింది సభకు స్వాగతం పలుకుతున్న ధనరాజు. సభలో ఒక్కో వక్తా పుస్తకంలోని విషయాలను లోతుగానే చర్చించారు. వాటిలో ముఖ్యాంశాలను వారి మాటల్లోనే వినండి.
సభాధ్యక్షత వహించిన జూలూరి గౌరీశంకర్ మాట్లాడుతూ “డా. కేశవకుమార్ బహుజనకెరటాలు, వివిధ పత్రికల్లో రాసిన వ్యాసాలను ఒక పుస్తకంగా తీసుకురావలసిన అవసరం ఉందని భావించాను. రచయితను సంప్రదించి పుస్తకంగా తీసుకొస్తానని అడిగినప్పుడు అంగీకరించారు. దీనిలో బహుజన తాత్త్వికత ఉన్న వ్యాసాలు ఉన్నాయి. చిన్న చిన్న పత్రికల్లో కంటే ప్రధానమైన పెద్ద పత్రికల్లో రావలసి ఉంది. నేను తెలంగాణా కోణం నుండే చూస్తాను. దీనిలో తెలంగాణ దళితకోణం ఉన్నా, కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు సంబంధించిన కోణం లేదు. దీన్ని చూడవలసిన అవసరం ఉంది. కారంచేడు, చుండూరు సంఘటనలపై రాసిన వ్యాసాలు ఆ సంఘటనలను అర్థం చేసుకోవడానికి ఒక డాక్యుమెంటరీలు గా ఉపయోగపడతాయి. కారంచేడు సంఘటనలో పేద కమ్మవాళ్ళు కూడా కులం ఆధారంగానే దళితులపై దాడి చేశారు. అప్పుడు వర్గం ఏమైంది.
సభాధ్యక్షత నిర్వహిస్సున్న జూలూరి గౌరీశంకర్.
వర్గమూ, కులమూ కలిసినప్పుడు లేదా ముందుగా మనుష్యులుగా మారమని మానవీయతను నింపుకోమని దళిత ఉద్యమం తెలుపుతుంది. వాటిని తాత్త్వికంగా, డాక్యుమెంటరీలుగా భద్రపరిచే విధంగా ఈ వ్యాసాల పుస్తకం ఉంది.’” అని వివిధ వక్తల ప్రసంగాలను సమన్వయిస్తూ చెప్పారు.
సభలో మాట్లాడుతున్న డా// సత్యనారాయణసభలో అధ్యక్షుడి తొలి పలుకుల అనంతరం ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటి అసోసియేట్ ప్రొఫెసర్ డా// కె.సత్యనారాయణ మాట్లాడుతూ…” కేశవకుమార్ సెంట్రల్ యూనివర్సిటిలో చదువుతున్నప్పటి నుండీ తెలుసు. ఆ యూనివర్సిటీలో జరిగిన అనేక సంఘటనల విషయంలో కలిసి పోరాడాం. చేతిరాతలు పత్రికలో స్లోపోయిజన్ కవిత రాయడం వెనుక ఒక దళిత విద్యార్థి ల్యాబ్ లో ఆత్మహత్య చేసుకున్న నేపథ్యం ఉంది. సునీత ఆత్మహత్య కు స్పందించి సునీత పొద్దున్నేపోస్టరై పలకరించింది ' పేరుతో ఒక పుస్తకం తీసుకొచ్చారు. ఇద్దరం కలిసి దళిత మ్యానిఫెస్టో కవితా సంకలనం తీసుకొచ్చాం. కేశవకుమార్ గురించి మాట్లాడటమంటే దళిత ఉద్యమం గురించి మాట్లాడటమే. కారంచేడు సంఘటన గురించి రాసిన వ్యాసం ఐక్యంగా దళితులు పోరాడితే కలిగే చైతన్యాన్ని విపులీకరించింది. బి.సి.ల గురించే కాకుండా, ముస్లిముల గురించీ రాశాడు. అయితే, ఈ పుస్తకంలో ఉన్న వ్యాసాల్లోని కొన్ని విషయాల పట్ల ఏకీభవించనివి కూడా ఉన్నాయి. వర్గీకరణ విషయంలో కాళ్ళుపట్టుకొనే పరిస్థితి ఏమిటి? సాయుధ పోరాట చైతన్యాన్ని అలవర్చుకోవాలి “ అని అన్నారు. సభలో మాట్లాడుతున్న డా// దార్ల వెంకటేశ్వరరావుసెంట్రల్ యూనివర్సిటి అసిస్టెంటు ప్రొఫెసర్ డా// దార్ల వెంకటేశ్వరరావు పుస్తకం గురించి మాట్లాడుతూ…” ఈ క్లిష్టమైన సమయంలో దళిత ఉద్యమం గురించి పుస్తకం తీసుకొని రావడం ఒక సాహసం. అలాంటి సాహసాన్ని చేసిన రచయితను అభినందిస్తున్నాను. నన్ను మాట్లాడమని చెప్పినా, దేని గురించి మాట్లాడాలో చెప్పలేదు. అంటే నాకు మాట్లాడే స్వేచ్చను ఇచ్చినట్లయ్యింది. నన్నుఈ సభలో మాట్లాడమనడం అంటే అది వ్యక్తిగతమైన సంబంధం వల్ల కాదు. ఒక మాదిగగా మాట్లాడమన్నారను కుంటున్నాను. ఒక మాదిగ విద్యావేత్తగా మాట్లాడమన్నారనుకుంటున్నాను. ఒక మాదిగ ఉద్యమ కారుణ్ణి మాట్లాడమన్నారను కుంటున్నాను. సర్వసాధారణంగా ప్రతి సమస్యను ఆ యా వ్యక్తులు తమ తమ కోణం నుండే చూస్తుంటారు. అభ్యుదయవాదులు దళిత ఉద్యమాన్ని, సాహిత్యాన్ని వేరు వేరుగా చూశారు. తెలంగాణా వాదులు దళితుల్లోని వర్గీకరణ సమస్యకు కూడా ప్రత్యేక రాష్ట్రమే పరిష్కారాన్ని చూపిస్తుందన్నారు. మార్క్సిస్టులు కులాన్ని కూడా వర్గం లో భాగంగానే చూస్తున్నారు. మాదిగలు అన్ని సమస్యల్ని వర్గీకరణ నేపథ్యంగానే చూస్తున్నారు. మాదిగ విద్యావేత్త గా ఈ పుస్తకాన్ని నేనూ అలాగే చదివాను. పుస్తకాన్ని ఒకసారి దళిత దృక్పథంతోనూ, మరొకసారి మాదిగ దృక్పథంతోనూ చదివాను. రెండు సార్లూ నిజమైన దళిత సమైక్యవాదమే కనిపించింది. దళితఉద్యమంలో నీడలు పరుచుకోవడానికి వర్గీకరణ సమస్య ఒక ప్రధాన కారణమని, దాన్ని నిజాయితీ గల నాయకత్వం లో పరిష్కరించుకొని ఉద్యమం ముందుకి వెళ్ళవలసిన అవసరం ఉందని చాటిన వ్యాసం ఈ పుస్తకంలో ఉంది. అందుకు అన్నా నిన్ను నేను అభినందిస్తున్నాను. దళితుల్లోని మాల, మాదిగల సంఘర్షణలను కాళీపట్నం రామారావు రాసిన కథ యజ్ణంలో దళితుని నిస్సహాయతతోనూ, నిత్య జీవితంలో పీడనకు గురవుతున్న పురుషుడు తన భార్యను కొట్టడం, వేధించడం వెనుక గల నిస్సహాయత వంటిదేనని అర్థం చేసుకోవాలని ఎంతో చక్కగా విశ్లేషించాడు రచయిత. ఈ మాల, మాదిగల నిస్సహాయత ఏదొక నాడు కచ్చితంగా ఇలాంటి అసమానతలకు కారణమవుతున్న అసలైన వారిపై ఒక బాంబులా బ్లాస్ట్ అయ్యే రోజు వస్తుందని అనడం మాదిగల పోరాటాన్ని పోజిటివ్ గా అర్థంచేసుకోవడమే అవుతుంది.
డా// కేశవకుమార్ రాసిన వ్యాసాలు మెయిన్ పత్రికల్లో రావడం లేదని అనుకోవడం కంటే, ఈనాడు వివిధ విశ్వవిద్యాలయాల్లో, వివిధ సంస్థల్లో ఉన్న దళితులు డా//బాబా సాహెబ్ అంబేద్కర్ బిక్ష వల్ల లేదా ఆయన సాధించిన హక్కుల వల్ల నాలుగు అక్షరాలను రాయగలిగే రచయితలు, తమ రాతలను ముందుగా తమ దళిత పత్రికల్లోనే రావాలనే ఆకాంక్షతో ఉంటున్నారు. అదొక చైతన్యం. అది డా// కేశవకుమార్ లో ఉందనుకుంటున్నాను. అందుకే ఆ వ్యాసాల్ని మెయిన్ పత్రికల్లో ప్రచురించుకోగలిగే సత్త ఉన్నా ముందుగా బహుజన కెరటాలు, తమ దళిత భావజాలాన్ని సమర్థించే పత్రికల్లోనే ప్రచురించాలని ఆశించి ఉంటాడు. నేడు ఉన్న దళిత పత్రికల్లో నిజమైన వ్యవస్థీకృత చైతన్యంతో నడుస్తున్న పత్రిక బహుజన కెరటాలు. దీన్ని సంపాదకులు, వ్యవస్థాపకులు చాలా ముందుచూపుతో దళిత మేధావుల్ని, రచయితల్ని ఒకే వేదిక పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. భవిష్యత్తు పట్ల మా దళితులకు గొప్ప ఆశను కలిగిస్తున్న పత్రిక అది. అది ఈ మధ్య వర్గీకరణను సమర్థస్తూ ఒక ప్రత్యేక సంచికను ప్రచురంచింది. అది నిజమైన బహుజన చైతన్యాన్ని నింపే ప్రక్రియ. నిజమైన దళిత ప్రజాస్వామ్యీకరణ. దళితులకు మీడియా ఇస్తున్న ప్రాధాన్యత ఎలాంటిదో మనందరికో తెలుసు. ఒక కారం శివాజీ, ఒక జూపూడి ప్రభాకరరావు, లేదా ఒక మంద కృష్ణ మాదిగ వాళ్ళ ఇరువురూ ఒకరినొకరు తిట్టుకోవడమో, పరస్పరం ఎమోషన్స్ కి గురిచేసుకోవడమో చేస్తుంటే ఎంతో ప్రాధన్యతనిస్తుంది మీడియా. అదే మీడియా వాళ్ళలో ఎవరైనా రాజ్యధికారం కోసమో, దళితుల్ని సమైక్యంగా చైతన్యం చేయడానికో ప్రయత్నిస్తే సహకరిస్తుందా? అప్పుడు కదా మీడియా నిజ స్వరూపం తెలిసేది. అందుకే బహుజన కెరటాలు వంటి పత్రికలు రావలసిన అవసరం, అలాంటి పత్రికలకు దళిత రచయితలు ఒక బాధ్యతగా రాయవలసిన అవసరం ఉందని నిరూపించి, వాటిని ఇంత మంచి పుస్తకంగా తీసుకొచ్చినందుకూ, ఆ పుస్తకంపై నన్ను కూడా మాట్లాడించినందుకు కృతజ్ణతలు తెలియజేస్తున్నాను. మాదిగల సమస్యను ఇలా నిజమైన ప్రజాస్వామిక దృక్పథం తో చర్చకు అవకాశం కల్పించినట్లైతే అప్పుడు నిజంగా దళిత సమైక్య ఉద్యమం బలపడుతుంది. ఈ పుస్తకంలో దళిత ఉద్యమం, ఉమ్మడి దళిత ఉద్యమం వంటి పారిభాషిక పదాలను ప్రయోగించాడు. అది పరోక్షంగా దళిత ఉద్యమంలో వర్గీకరణ ఉద్యమాన్ని గుర్తించడంగానే భావిస్తున్నాను’ అని విశ్లేషించారు. సభలో మాట్లాడుతున్న డా//చల్లపల్లి స్వరూప రాణిబుద్దిస్ట్ స్టడీస్ సెంటర్ లో అసోసియేట్ ప్రొఫెసర్ డా// చల్లపల్లి స్వరూపరాణి మాట్లాడుతూ " కేశవకుమార్ అలోచనా దృక్పథంలో పరిణామం కనిపిస్తుంది. మొదట్లో వర్గ దృక్పథంతో రాసే వాడు. ఇప్పుడు అంబేద్కర్ అలోచనా దృక్పథంతో రాయడం సంతోషించదగిన విషయం. దళితుల ప్రత్యామ్నాయ చారిత్రక దృక్పథం తో చరిత్రను అధ్యయనం చేసిన తీరు బాగుంది. మహిళా రిజర్వేషన్ గురించి కూడా రాశాడు. అది కవిత్వమైనా, వ్యాసమైనా దళిత మాండలికంలో రాస్తాడు. దాని వల్ల గ్రామీణ ప్రాంతంలోని దళితులు కూడా పత్రికను తమ పత్రికగా ఫీలవుతూ చదువుకుంటున్నారు. బహుజన కెరటాలు పత్రిక దండోరా ఆశిస్తున్న వర్గీకరణను సమర్థిస్తూ ఒక ప్రత్యేక సంచికను వేశాం. అది చాలా బాగుందని వ్యక్తిగతంగా మెచ్చుకున్నా, దాన్ని బయట చెప్పకపోవడం విచారకరం. అలాంటి ప్రజాస్వామిక చర్చను ఆహ్వానించినప్పుడు నిజంగా స్పందించవలసిన అవసరం ఉంది. అప్పుడే నిజమైన నిజాయితీ కనిపిస్తుంది’’ అని అన్నారు. సభలో మాట్లాడుతున్న కలేకూరి ప్రసాద్ప్రముఖ దళిత కవి, విమర్శకులు కలేకూరి ప్రసాద్ మాట్లాడుతూ " సింహాలు మాట్లాడనంత కాలం పిట్టకథలే చరిత్రలవుతాయి. కనుక దళితులు చరిత్రలను రాసుకోవాలి. అనేక సందర్భాల్లో రాసినప్పటికీ ఒక అంతస్సూత్రంతో దళిత చైతన్యం కనిపిస్తుంది. చరిత్రను ఏ దృక్పథంతో రాయాలో ఆ దృక్పథంతో రాశాడు. అభినందనీయుడు " అని అన్నారు.
సభలో కూర్చున్న ప్రసిద్ద రచయిత్రి మహేజబీన్ ని మాట్లాడమని వేదిక పైకి పిలిచారు. సభలో మహేజబీన్ మాట్లాడుతూ "ఇక్కడికి రాకపోతే దళిత సాలిడారిటీ లేదంటారేమోనని వచ్చాను. మా ముస్లిములను కూడా దళితులుగా కలుపుకుంటే బాగుంటుంది. నన్ను నేను వేదిక పై నుండి దళితగానే ప్రకటించుకుంటున్నాను” అని అన్నారు. సభలో మాట్లాడుతున్న పల్నాటి శ్రీరాములుబహుజన కెరటాలు వ్యవస్థాపకుడు పల్నాటి శ్రీరాములు మాట్లాడుతూ ‘" మాదిగ దండోరా, తుడుం దెబ్బ, ఎలుక కుర్రు మొదలైన అస్తిత్త్వ కుల ఉద్యమాల నుండి ప్రేరణతో బహుజనకెరటాలు మాసపత్రిక స్థాపించాను. కామ్రేడ్ వీరయ్య భావజాలంతో పత్రిక పెట్టాలనే ఆలోచన వచ్చింది. ఆయన ప్రోత్సాహం ఎంతో ఉంది. బొజ్జా తారకం వంటి వాళ్ళు నడిపిన పత్రికలను క్రమం తప్పకుండా చదివే వాడిని. వాటినుండి కూడా అనేక విషయాలను నేర్చుకోగలిగాను. రిజిస్త్రేషన్ లేకుండా ప్రారంభమైన పత్రిక ప్రకటనలు లేక నడపడం అసాధ్యమైన పరిస్థితిలో శ్రీపతి రాముడు ఢిల్లీ నుండి రిజిస్త్రేషన్ పంపించాడు. కలేకూరి ప్రసాద్ ఎన్నో ప్రధాన మైన మెయిన్ స్టీమ్ పత్రికల్లో చేయగలిగే, రాయగలిగే అవకాశం ఉన్నా, తన కాలాన్ని ఎంతటినో పత్రిక కోసం త్యాగం చేశాడు. మద్దూరి నగేశ్ బాబు పై ప్రత్యేక సంచిక వేసిన తర్వాత పత్రిక నిజమైన దళితుల దగ్గరకు చేరుకోగలిగింది. సర్క్యులేషన్ కూడా మూడువేలు దాటింది. చాలా మంది రాస్తున్నా, ఇంకా దళిత రచయితలే ఈ పత్రికకు రాయకపోవడం కొరతగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో డా// చల్లపల్లి స్వరూపరాణి ని సంపాదక బాధ్యతలు వహించమని కోరాను. డా//కేశవ కుమార్ రెగ్యులర్ గా మాట్లాడుతూ ఈ పత్రికకే వ్యాసాలు రాస్తున్నాడు. అలా వచ్చినవే కారంచేడు, చుండూరుపై రాసిన వ్యాసాలు. అవి పత్రికకు ఎంతో పేరు తెచ్చాయి.
సురేష్ మాదిగ లాంటి వాళ్ళు ఆత్మ హత్య చేసుకోవడానికి గల కారణాలను అర్థం చేసుకొని వర్గీకరణ సమస్యను సామరస్య పూరకంగా పరిష్కరించుకోవలసిన అవసరం ఉంది. ఇలాంటి సమస్యలకు ఉమ్మడి వేదికలు ద్వారా పరిష్కారాలు వేగవంతంగా జరుగుతాయి. వర్గీకరణను సమర్థిస్తూ బహుజన కెరటాలు ఒక ప్రత్యేకసంచికను కూడా ప్రచురించింది” అని అన్నారు. సభలో మాట్లాడుతున్న వరవరరావుప్రముఖ విప్లవ కవి వరవరరావు మాట్లాడుతూ “కేశవకుమార్ నాకు చాలా ఆత్మీయుడు. అతడు నాకు చాలా కాలం నుండీ తెలుసు. నాకు అతని ఉద్యమ స్పూర్తి తెలుసు. చిక్కనవుతున్న పాట కంటే ముందుగానే దళిత మ్యానిఫెస్టో ప్రచురించాడు. కారంచేడు ఉద్యమం విప్లవోద్యమాలను ఆలోచింపజేసింది. ఆ సంఘటనలో ప్రధాన కారణమైన వాళ్ళలో చెంచురామయ్యను విప్లవోద్యమమే శిక్షించింది. కారంచేడు ఉద్యమంలో విప్లవోద్యమ కార్యకర్తలు అక్కడ అనేక రోజుల పాటు క్యాంపు వేసి ప్రజలతో ఉన్నారు. చుండూరు సమస్యను భూమితో ముడిపడిన సమస్యగా విప్లవోద్యమం చూసింది. దానితో పనిచేసింది. మేము దళితులతో ఐడెంటిఫై అవుతుంటే అది కుట్ర అవుతుందా? మార్క్సిస్టులు కుల ఉద్యమాలను అధ్యయనం చేస్తున్నారు. రిజర్వేషన్స్ పట్ల , ముఖ్యంగా జనాభా ప్రాతిపదిక పై అది కొనసాగితే బాగుంటుంది. వర్గీకరణను సమర్థిస్తూ చెప్పడమే కాకుండా బయట ఉద్యమాలతో కూడా మమేకమై ముందుకు నడవాలని ఆశిస్తున్నాను. కారంచేడు, చుండూరు సంఘటనలపై రాసిన వ్యాసాలు చాలా ఆలోచనాత్మకంగా ఉన్నాయి. ఈ పుస్తకంలో గురజాడ రాసిన కన్యాశుల్కంపై కొన్ని వ్యాఖ్యలు ఉన్నాయి. నిజానికి మధురవాణిలో గురజాడ ఉన్నాడు. దాన్ని రచయిత గుర్తించాలి’’ అని అన్నారు. సభలో మాట్లాడుతున్న విద్యాసాగర్ ఐ.ఎ.ఎస్ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రపదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ కమీషనర్ విద్యాసాగర్ ఐ.ఎ.ఎస్, మాట్లాడుతూ " మనం ఇక్కడ మాట్లాడుకొనే విషయాలు చాలా విలువైనవి. ఇక్కడ మాట్లాడే విషయాలు అనేక మందికి వ్యాపిస్తాయి. అంబేద్కర్ ఆలోచనలను ఆలోచిస్తున్న వాళ్ళు ఎలా ఉన్నారో ఈ పుస్తకంలో పట్టుకోగలిగారు. నిజంగా దళిత ఉద్యమం వెనుకబడే ఉందా? దళిత సాహిత్యం కొంతమందికే చెందిందా? అనే ప్రశ్నలను, దానికి అనేక సమాధానలను ఈ పుస్తకం అందిస్తుంది. నిజంగా సమానత్వం, ఆధిపత్యం కోసం మాట్లాడేవాళ్ళు చేస్తున్నదేమిటని ఆలోచింపజేస్తుంది. ఏ ఉద్యమానికైనా వెలుగు నీడలు, ఉత్థాన పతనాలు ఉండటం సహజం. అలాంటివి జీవితంలోనూ చాలా సహజం. అయితే అవి కొత్త కొత్త రూపాల్ని సంతరించుకొని ముందుకొస్తాయి.
చాలా మంది అంబేద్కర్ ని లిబరల్ బూర్జువాగా గుర్తించడంలోని ఆంతర్యాన్ని రచయిత పట్టుకోగలిగారు. ఈ పుస్తకం మొదటి వ్యాసంలోనే పుస్తకం తత్త్వాన్ని అంతటినీ పట్టుకోగలిగారు. చదివినదీ, చెప్పేదీ ఫిలాసపీ కావడంతోనేమో, అంబేద్కర్, దళిత ఫిలాసఫీని పట్టుకోగలిగారు. చరిత్ర దృక్పథాన్ని, ఆధునికతను వివరించడంలో అవి స్ప్తష్టంగా కనిపిస్తాయి.
నేనీ మధ్య పంచమం నవల చదివాను. దానిలో ప్రభుత్వం ఆధ్వర్యంలో సీలింగ్ ద్వారా వచ్చిన భూమిని పంచడానికి అధికారులు సిద్దమవుతుంటారు. అప్పటికే అక్కడ బీ,సీ, లు మిగతా కులాల వాళ్ళు ఉన్నా, ఆలస్యంగా వచ్చిన మాదిగలకే ముందుగా పేర్లు రాస్తారు. అప్పుడు బి.సి.లు కోపపడినా, వాళ్ళలో వాళ్ళే మరలా మాట్లాడుకుంటూ, మనకి సమాజంలో గౌరవం ఉంది. అది మాదిగలకి ఎక్కడ వస్తుంది అనే ఆత్మ గౌరవాన్ని ప్రకటిస్తారు. ఇక్కడ గమనించవలసింది ఒకటి ఉంది. మనం ఔననుకున్నా, కాదనుకున్నా కులం పోవాలనుకుంటూనే, ఆకులం వల్ల వచ్చే అవకాశాలను వదులుకోలేని స్థితిలో ఉండటం ఒక విచిత్ర సన్నివేశం. కులం వల్ల మన సమాజంలో కొన్ని ఔనన్నా, కాదన్నా జరిగిపోతుంటాయి. ఆధిపత్యం ఒక వైపు, మరొక వైపు సమానత్వం కోసం పోరాటం నిరంతరం జరుగుతూనే ఉంటుంది. కులం వల్ల అవకాశాలు తాత్కాలికంగా వస్తున్నా, కింది కులాల వాళ్ళు తమ కులం కొనసాగాలని కోరుకోరు. కానీ, ఆ కులంలో ఉంటూనే ఆ కులాన్ని పోగొట్టుకోవాలని పోరాడుతుంటారు. అది ఆధిపత్యం, సమానత్వం ల మధ్య జరుగుతున్న పోరాటం. అలా కులంతోనే పోరాడుతూ సమానత్వం కోసం ముందుకొస్తున్న వాళ్ళు కోరుకొనేదేమిటో ఆధిపత్య కులాలు, వర్గాలు అర్థం చేసుకోవాలి.
కులాన్ని, వర్గాన్ని అర్థం చేసుకోవడానికి కారంచేడు, చుండూరు పై ఈ పుస్తకంలోని వ్యాసాలను కే స్ స్టడీస్ గా చెప్పుకోవచ్చు. మనం ఆధినికతను కూడా ఒకేలా ఆలోచించలేం. అది మనకి తెలియకుండానే పాత అసమానతల్ని కొత్త మాటలతో కొనసాగించే తాత్త్వకతను కలిగి వస్తుంటుంది. దాన్ని లోతుగా అర్థం చేసుకోక పోతే, అధునికత కొనసాగే తీరు అర్థం కాదు. ముందుకొచ్చిన వాళ్ళు ఆధిపత్యాన్ని , అవకాశాలను పొందిన వాళ్ళు వాటిని మరిచి పోయి, అదే ఆధిపత్యాన్ని కొనసాగిస్తుండటం వల్ల సమానత్వం కోసం మాట్లాడేవాళ్ళు ఐక్యతను కూడా ఒక తాత్త్వక భావనగా విశ్లేషిస్తుంటారు. ఆధునికతలో అంతర్భాగంగా చూపిస్తుంటారు. ఈ క్లిష్టత అర్థం కావాలంటే, సమానత్వం కోసం పోరాడేవాళ్ళ వేదనను అర్థం చేసుకోవాలి.
చదువుకున్న వాళ్ళు ఒక వర్గంగా తయారై తమ మాలాలను మరిచిపోతున్నారు. వాళ్ళు మరో వర్గంగా తయారవుతున్నారు. ఇది గుర్తించి ముందుకెళ్ళాలి. బహుజనకెరటాలు వంటి పత్రికలు దళిత ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నించడం అభినందనీయం ” అని సమకాలీన సమాజంలోని అనేక అసమానతలను, ఆధిపత్యాలను విశ్లేషించి, నిజమైన మేధావులు పీడితుల పక్షాన్ని నిలవ వలసిన అవసరాన్ని వివరించారు. సభలో మాట్లాడుతున్న బొజ్జా తారకం దళిత ఉద్యమ నాయకులు, ప్రముఖ న్యాయవాది గ్రంథావిష్కర్త బొజ్జాతారకం మాట్లాడుతూ " దళిత ఉద్యమాన్ని చాలా తేలికగా చూడకూడదు. అది చాలా గంబీరమైన సమస్య. ఈ పుస్తకం వ్యాసాల రూపంలో కాకుండా, సైద్ధాంతిక నేపథ్యంతో ఒక పుస్తకంగా రాయవలసింది. రాసేటప్పుడు కొంత చరిత్రను, పరిశీలించవలసిన అవసరం ఉంది. కులం, మతం వంటివి బలమైన సామాజిక సమస్యలు.వీటికి పరిష్కారాన్ని సూచించే గ్రంథాన్ని ఒక్కటి చెప్పగలరా? అంబేద్కర్ కులనిర్మూలన తర్వాత గానీ, ముందుగానీ అలాంటి గ్రంథం వచ్చిందా? మరెందుకు అలా జరిగింది? ఆలోచించవలసిన అవసరం లేదా? కారంచేడు, చుండూరు సంఘటనలనే దళిత ఉద్యమాలుగా చూపే ప్రయత్నం కనిపిస్తుంది. అవే దళిత ఉద్యమాలు కాదు. అంతకుముందు కర్రలతో, సాములతో ఆత్మగౌరవపోరాటాలు జరిగాయి. అంతకుముందు జరిగిన పోరాటాల నేపథ్యమే కారంచేడు, చుండూరు సంఘటనలను పోరాటాలుగా మార్చాయి. కారంచేడుకు ముందూ, కారంచేడుతోనూ, కారంచేడు తర్వాతా నేను ఉద్యమం లో ఉన్నాను. కానీ, నన్ను విస్మరించడం, లేదా మా ప్రస్తావన లేకుండానే కారంచేడు ఉద్యమమే ప్రధానం అన్నట్లు మాట్లాడుతున్నారు.
నేను మీతో కలిసి పనిచేయకూడదా? అని వరవరరావు గారు మాట్లాడుతున్నారు. ఆయన అలా మాట్లాడటం వెనుక కారంచేడు ప్రేరణ ఉంది. అది వరవరరావు మాట్లాడిన మాట కాదది. అగ్ర్తకుల సంస్కృతి అడగటం గా గుర్తించాలి. ఇప్పుడు అగ్రకులం వాళ్ళు అడగడం గా గుర్తించాలి. ఇప్పుడు వరవరరావు లాంటి వాళ్ళు తాను మాల, మాదిగ అనడంలో కులనిర్మూలన చైతన్యం ఉంది. మా గురించి రాయొద్దంటే, తమ గురించి వాస్తవం రాయలేదు కాబట్టి, అది గమనించి దళితులు రాయొద్దన్నారు. ఉద్యమం అనేక రూపాల్లో ఉంటుంది. దానిలో భాగంగానే అప్పుడు రాయొద్దన్నారు. రాయొద్దు అనడం వెనుక, మాగొంతుతో రాస్తే వద్దనడం కాదు. అయినా, మా గొంతు మాకుండగా ముందు మేమే మాట్లాడతామని చెప్పడంగా గుర్తించాలి. మా గురించి రాయండి. కానీ, మా గొంతుల్ని నొక్కేస్తూ మాట్లాడమనలేం, మా గొంతుల్తోనూ మాట్లాడండి, మా గొంతులుగా మాట్లాడండి. మా గొంతుతో కలిపి పాడు, మాగొంతుతో కలిపి మాట్లాడు, కానీ..మా గొంతు మాకుందని గుర్తించని చెప్తున్నాం,
నేనీ పుస్తకం చదవలేదు. దీనిలోని విషయాల గురించి మాట్లాడడం లేదు. నన్ను మన్నించాలి. దళిత ఉద్యమం ఒక ప్రవాహం. దానికి ఆటుపోటులు ఉండవచ్చు. సమాన హోదా, సమానత్వం కలిగినప్పుడు ఉద్యమం అవసరం ఉండదు. అది లేదని భావించే వాళ్ళు పోరాడుతూనే ఉంటారు. దాని గమ్యం చేరేవరకూ అది ముందుకి వెళ్తూనే ఉంటుంది. ఆ ఉద్యమం మరింత ముందుకి తీసుకెళ్ళడానికి ఈ పుస్తకం తోడ్పడుతుందని భావిస్తున్నాను" అని మాట్లాడారు.పుస్తక రచయిత
సభలో తన స్పందనను తెలుపుతున్న రచయిత డా//పి.కేశవకుమార్పుస్తక రచయిత డా//కేశవకుమార్ మాట్లాడుతూ " ఈ సభకు వచ్చిన వాళ్ళంతా నాకున్న వ్యక్తిగత సంబంధాల వల్ల వచ్చిన వాళ్ళు కాదు. అలా నేను అనుకోవడం లేదు. నా భావజాలం తెలిసి వచ్చారనుకుంటున్నాను. ఇప్పుడు ఏవో కొన్ని లేబుల్స్ కి మాత్రమే పరిమితమై ఉండే పరిస్థితి సరైంది కాదు. ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు చాలా స్పష్టంగానే మాల, మాదిగలు తమ తమ సమస్యల గురించి ఎవరి వాదాన్ని వాళ్ళు మాట్లాడుకొనే స్థితే ఉంది. నిజానికిప్పుడు దళిత కవిత్వంలో మాల వాళ్ళు మాదిగల గురించి మాదిగ వాళ్ళు మాలల గురించి క్రిటిసైజ్ చేయలేని పరిస్థితి కనిపిస్తుంది. చాలా మంది దబాయింపునే కవిత్వంగా తీసుకొస్తున్నారు. ప్రస్తుతం బార్గెయినింగ్ కెపాసిటీ స్థితిలోకి దళిత ఉద్యమాలను తీసుకొస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో, ఎవరూ మాట్లాడని స్థితిలో, పబ్లిక్ గా ఒకటి, ప్రైవేట్ గా మరొకటి మాట్లాడుకొనే పరిస్థితి కనిపిస్తుంది. నేనిప్పుడేదో దళిత్స్ యునైట్స్ గా ఉండాలని, దానికోసమే దీన్నంతటినీ చేస్తున్నాననే భ్రమలేమీ నాకు లేవు. కానీ, దళిత మేధావులు ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో ఏ పక్షంలో ఉంటున్నారనేది చాలా ముఖ్యం. ఇరుపక్షాల లోనూ మేధావులు మీడియేటర్స్ గా వ్యవహరించడం చాలా విచారకరం. దళిత ఉద్యమం సంక్షోభం లోకి నెట్టబడుతున్నప్పుడే దళిత రచయితలు ఎక్కువగా రాయాలి, కానీ, దళిత రచయితలు దాన్ని విస్మరిస్తున్నారు. మేధావులు క్రియాత్మకంగా వ్యవహరించకపోవడం సరైంది కాదు. యూనివర్సిటీల నుండి వచ్చేవాళ్ళు రాయగలిగే అవకాశం ఉండీ రాయకపోవడం సరైంది కాదు. నేను యూనివర్సిటీలో ఉండడం వల్ల కాస్త చదువుకోగలిగే అవకాశం కలుగుతుంది. దాన్ని రాయగలిగే అవకాశమూ ఉంది. కళ్యాణ రావు గారి అంటరాని వసంతం నవల నన్ను ఎంతగానో ప్రేరేపించింది. ఆ ప్రేరణతో , నాకున్న సమయం వల్లనే నేను రాయగలుగుతున్నాను. బహుజన కెరటాలు పత్రికకు కావాలనే రాస్తున్నాను. నిజానికి దళిత పత్రికలను ప్రచురించడంలో అనేక ఇబ్బందులు ఉన్నాయి, వాటిని అధిగమించి ముందుకు రావాలంటే ముందుగా మనలాంటి వాళ్ళు రచనా పరంగా సహకరించగలగాలి. అవసరమైతే రకరకాలుగా సహకరించాలి. దానిలో భాగంగానే నేను ఈ పత్రికకు రెగ్యులర్ గా రాస్తున్నాను, ఇప్పుడు వచ్చిన వ్యాసాలు అత్యధిక శాతం దానిలో వచ్చినవే, దళిత మ్యానిఫెస్టో నేను ప్రచురించాను. నిజమే, దాన్ని అనుసరించో, లేదో మరో దాన్ని అనుసరించో వ్యక్తులకు కొన్ని లేబుల్స్ వేసే ముందు వారి రచనా పరిణామాన్ని, భావజాలంలో వచ్చిన వికాసాన్ని అవగాహన చేసుకోవాలి. ఆ స్థితి గతులు గమనించకుండా, అవేమీ తెలియకుండా లేబుల్స్ వేయడం మంచిది కాదు. ఈ వ్యాసాలు ఇలా పుస్తకరూపంలోకి రావడానికి కారణమైన వారందరికీ నా కృతజ్ణతలు తెలుపుతున్నాను. అలాగే ఈ పుస్తకంలోని విషయాలను నిర్మొహమాటం గా చర్చించినందుకు కూడా సంతోషంగా ఉంది. మీ అందరికీ కృతజ్ణతలు" అని తన స్పందనను తెలిపారు.
సభ భీమ్ కుమార్ వందన సమర్పణతో ముగిసింది.
సభలో పాల్గొన్న జనం వందన సమర్పణ చేస్తున్నభీమ్ కుమార్
సభానంతరం చర్చిస్తున్న వారిలో వరసగా డా//చల్లపల్లి స్వరూప రాణి, డా//దార్ల, విద్యాసాగర్ లు సభలో పాల్గొన్న సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల్లో ఓ ముగ్గురిలా ఫోటోకి ఫోజిచ్చుకునారు!
Read more...
checkFull("post-" + "2282899154797941145");
Posted by డా.దార్ల at 6:46 PM 1 comments
Labels: దళిత, దార్ల
దళిత ఉద్యమం-వెలుగు నీడలు ఆవిష్కరణ: పత్రికల స్పందన
#fullpost{display:none;}
వేదిక పై వరుసగా కలేకూరి ప్రసాద్, డా//దార్ల వెంకటేశ్వరరావు, విద్యాసాగర్, ఐ.ఎ.ఎస్., పుస్తక రచయిత డా//పి.కేశవ కుమార్, జూలూరి గౌరీశంకర్,బొజ్జా తారకం, డా//సత్యనారాయణ ఉన్నారు. వార్త దిన పత్రిక ప్రచురించిన విశేషాలుఈనాడు దిన పత్రిక ప్రచురించిన విశేషాలుసాక్షి దిన పత్రిక ప్రచురించిన విశేషాలు ఆంధ్రజ్యోతి దిన పత్రిక ప్రచురించిన విశేషాలుRead more...
checkFull("post-" + "1603304760464385312");
Posted by డా.దార్ల at 7:59 PM 0 comments
Labels: దళిత, దార్ల, సమకాలీనం
వర్గీకరణను సమర్థించిన పుస్తకం దళిత ఉద్యమం- వెలుగు నీడలు
#fullpost{display:none;}
-డా//దార్ల వెంకటేశ్వరరావు
అసిస్టెంట్ ప్రొఫెసర్, తెలుగు శాఖ,
హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటి, హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్
vrdarla@gmail.com
అందరికీ నమస్కారం,
దళిత ఉద్యమం- వెలుగు నీడలు అనే ఈ పుస్తకం పై మాట్లాడడానికి నాకు కూడా అవకాశం కల్పించినందుకు గ్రంథ రచయిత డా//పి. కేశవకుమార్ గార్కి కృతజ్ణతలు తెలియజేస్తున్నాను.
సర్వసాధారణంగా ప్రతి సమస్యనీ తమ దృష్టి కోణం నుండే చూస్తుంటారు. అభ్యుదయవాదులు దళిత సమస్యను దళిత ఉద్యమం, దళిత సాహిత్య వాదం గా విభజించి చూశారు. అలా దళిత సాహిత్యం ఇంక వాదంగానో, ధోరణిగానే ఉంది తప్ప, ఉద్యమస్థాయిని పొందలేదని ఎస్.వి.సత్యనారాయణ లాంటి వాళ్ళు వ్యాఖ్యానిస్తున్నారు. దీన్ని దళిత మేధావులు ఖండించారు. వారిలో కత్తి పద్మారావు, బొజ్జాతారకం తదితరులు వేగంగా స్పందించారు.
మార్క్సిస్టులు కులం కూడ వర్గంలో భాగంగానే చూస్తుంటారు.తెలంగాణా వాదులు ప్రత్యేక రాష్ట్రమే సమస్యల పరిష్కారం చేస్తుందని వాదిస్తున్నారు. దళిత సమస్యలో ప్రస్తుత వర్గీకరణ సమస్యను ఆ దృష్టితోనే చాలా మంది తెలంగాణా వాదులు చూస్తున్నారు. మాలలు సమైక్య వాదంతో విశ్లేషిస్తున్నారు. ఎస్.సి.లోని అన్ని పీడిత కులాల గురించి మాట్లాడుతున్నట్లే ఉంటూ, మాదిగల సుదీర్ఘ సమస్య అయిన వర్గీకరణను విస్మరిస్తుండటమో లేదా దాన్ని స్పృశించకుండానే సమస్యల్ని చర్చకు పెట్టడమో, అది పెద్ద సమస్య కాదన్నట్లు వ్యవహరించడమో చేస్తుంటారు. మాదిగలు తమకి అత్యవసరమైన వర్గీకరణ సమస్య నుండే అన్ని సమస్యలను చూస్తుంటారు. ఈ పుస్తకాన్ని నేను మాదిగ దృక్పథంతోనే చూస్తున్నాను.
అంబేద్కర్ ని లిబరల్ బూర్జువా గా చూసే బ్రాహ్మణీయ ఆలోచనలను ఖండిస్తూ బలమైన తార్కికతనే వినిపించగలుగుతూనే, అన్ని సమస్యలకు, అంబేద్కర్ భావజాలమే పరిష్కారమనే వాదన సరైంది కాదని చెప్పడంలో రచయిత డా// కేశవ కుమార్ వస్తు గత దృష్టి ( objectivity) కనిపిస్తుంది.
మీడియా గురించి చెప్పిన వ్యాసంలో బి.సిల గురించి, అలాగే ముస్లిములను ( పుట: 58 – 67, 102 – 112) ) స్ర్తీలను ( పుట: 96), దళితులపై క్రైస్తవ మతప్రభావాన్ని (పుట: 98-101) ప్రస్తావించిన రచయిత మాదిగలను, వారి ఉద్యమాన్ని, సాహిత్యాన్ని దళిత సాహిత్యంలో అంతర్భాగంగానే (పుట:76) పరిశీలించారు. మాదిగల వర్గీకరణ సమస్యను ఒక ప్రజాస్వామిక పద్దతిలో, సామరస్య వాతావరణంలో పరిష్కారం కావాలనే ఆకాంక్షను దళిత ఉద్యమం- సామాజిక న్యాయపోరాటాలు’ వ్యాసం ( పుటలు: 44 - 49) లో సుదీర్ఘంగానే రచయిత చర్చించాడు. ‘బ్రాహ్మణత్వ’ పారిభాషిక పదంలా ‘మాలత్వ’ వంటి వాటిని ప్రయోగంచడంలో సంయమనాన్ని పాటించాలని సూచిస్తున్నాడు. వర్గీకరణ సమస్యను విశ్లేషిస్తూ నిస్సహాయుడైన భర్త యజమాని పై తిరగబడలేని నిస్సహాయతనే భార్యను వేదించేలా కనిపిస్తుందని, అలాగే కా.రా. రాసిన యజ్ణం కథలో దళితుడు నిస్సహాయతతో తన కొడుకిని నరికేలా చేసినట్లు వర్ణించిన సామ్యాలతో దళితుల్లోని లోతైన తరతరాల వేదనామయ జీవితాన్ని పట్టుకోగలిగాడు. ఈ సందర్భంలో రచయిత వ్యాఖ్యలను తప్పని సరిగా గుర్తుచేసుకోవలసినవి కొన్ని ఉన్నాయి.
’మాల కులానికి చెందిన దళిత కవులు ఒక సామూహిక స్వప్నం ఎజెండా నుంచి తొలిగి పోయాక ఒక అక్షరం కూడా రాయలేకపోయారు. మాదిగ కులానికి చెందిన దళిత కవులు మాదిగ కవులుగా కాస్తంత గౌరవం తెచ్చుకున్నా ఒక అడుగు కవిత్వంలో ముందేసినా ఆ తర్వాత ఆగిపోవాల్సి వచ్చింది” ( పుట: 48)
“జనాబా ప్రాతిపదికన యస్సీ రిజర్వేషన్లలోవర్గీకరణ జరగాలన్న మాదిగల డిమాండ్ న్యాయ సమ్మత మైంది. అందుకు అందరు మేధావుల నుండి ప్రజాస్వామిక ఉద్యమాల నుండి ,అన్ని రాజకీయ పార్టీల నుండి ఆమోద ముద్ర లభించింది కూడా! వర్గీకరణ డిమాండ్ ని వ్యతిరేకిస్తున్నమాల మహానాడుకి, మాల కులానికి చెందిన దళిత మేధావుల మద్దతు లేదు.” ( పుట: 47-48)
“ప్రధాన వైరుధ్యాలు ఉన్న దళితులు, దోపిడీ అగ్ర కులాల మధ్య కన్నా మిత్ర వైరుధ్యాలున్న మాలా, మాదిగ కులాల మధ్య ఎక్కువ శత్రుత్వం, ద్వేషం, అనుమానం ఉన్నట్లుందని, అలా కనిపిస్తుందని చాలా మంది భావించడం జరుగుంతుంది. నిజానికి ఈ రెండు ఉపకులాలు తరాల తరబడి వెనుకుబాటు తనానికి గురైనవే. అంటరానితనాన్ని, ఆకలిని, దారిద్ర్యాన్ని, అవమానాల్ని అనుభవించడంలో మినహాయింపులేని కులాలే ( పుట: 46)
అని దళితులు ఉమ్మడిగా ఉద్యమాలు చేయవలసిన అవసరాన్ని ఈ వ్యాసాలన్నింటిలోనూ విస్తరించాడు.
”దళిత ఉద్యమం. ఉమ్మడి దళిత ఉద్యమం వంటి ప్రత్యేక పారిభాషిక పదాలను పుస్తకం ( పుట: 26) ప్రయోగించినప్పుడు అవి ఎలా పుట్టుకొచ్చాయో చెబితే ఇంకా బాగుండేది. కానీ, పరోక్షంగా మాదిగ వర్గీకరణ ఉద్యమం వల్లే ఆ నూతన పారిభాషిక పదాలు పుట్టుకొచ్చాయని గుర్తించవలసి ఉంది.
పుస్తకంలో వ్యావహారిక భాషను వాడాలనే కుతూహలంలోనో, ఆంగ్ల ప్రభావం నుండి తప్పించుకోలేకో తెలుగు భాషకున్న నాజూకు తనాన్ని మరింత సాధించవలసి ఉంది. అలాగే, టైపో గ్రాఫిక్ దోషాలని సమర్థించుకోవాలని చూడక పోతే, బ్ చాలా చోట్ల అక్షర దోషాలను కూడా సరిచేయవలసిన అవసరం ఉంది. ఉదాహరణకు అస్తిత్త్వం అని రాయవలసి ఉండగా, అస్థిత్వం ( పుట: 06) అనీ, భేదాభిప్రాయాలు కి బదులు బేధాభిప్రాయాలు ( పుట: 09) వంటివి చిన్నచిన్నవే అయినా వాటి వల్ల చాలా ప్రమాదాలు ఉన్నాయి.
మంచి పుస్తకానికి సంపాదకుడు వ్యవహరించిన జూలూరి గౌరీశంకర్ ని అభినందిస్తున్నాను, అయితే, ఆయన చేసిన సంపాదకత్వం ఏమిటో వివరిస్తూ కనీసం ఒక పుటలోనైనా రాస్తే బాగుండేదనిపించింది.
మొత్తం మీది పుస్తకం లో వ్యాసాలు అంబేద్కరిజాన్ని, ఆ వెలుగులో బహుజనవాదానీ, తద్వారా దళిత ఉద్యమ లక్ష్యమైన రాజ్యాధికార భావజాలాన్ని సమర్థవంతంగానే వ్యక్తం చేయగలిగిందని నిస్సందేహంగా చెప్పవచ్చు. దళితుల, ముఖ్యంగా మాదిగలు కోరుకుంటున్నా వర్గీకరణ సమస్యను ప్రజాస్వామిక ధోరణితో చర్చకు ఆహ్వానించిన రచయితను మనసారా అభినందిస్తున్నాను. మొత్తం మీది ఈ పుస్తకం పై నా అంచెనాను కింది విధంగా అభిప్రాయపడుతున్నాను.
దళిత ఉద్యమం- వెలుగు నీడలు పుస్తకాన్ని మాదిగ దృష్టితో చూసినప్పుడు దళిత సమస్యలను సాధికారికంగా చెప్తూనే, ఆంధ్రప్రదేశ్ లోని దళిత ఉద్యమంలోని వెలుగు మాల నాయకుల ఆధ్వర్యంలో జరిగిన పోరాటం గానూ, ఆ వెలుగు మరింత తేజోవంతం కాకపోవడానికి, తాత్కాలికంగా నీలి నీడలు కమ్ముకోవడానికీ, దళిత ఉద్యమానికి మాదిగలు కలిసి రాకపోవడమే కారణమవుతుందని రచయిత చాలా వ్యూహంతోనే చెప్తున్నాడని అనిపిస్తుంది. బ్రాహ్మణీయ కుట్ర, వర్గ, అంతర్గత, ప్రాంతీయత వంటి సమస్యలు తాత్కాలికంగా కమ్ముకుంటున్న నీడలే తప్ప, అవి చీకటిని సృష్టించలేవనే ఆశావాదాన్ని ప్రకటిస్తున్నాడు. దళిత సమస్యలను వాస్తవిక దృష్టింతో చూస్తూనే, నిజమైన సమైక్యతను ఆకాంక్షిస్తున్నాడు. అందుకే నా అభినందనలు తెలుపుతున్నాను.
( డా//పి.కేశవకుమార్ రచించిన దళిత ఉద్యమం-వెలుగునీడలు గ్రంథావిష్కరణ సభ, ప్రెస్ క్లబ్బు, హైదరాబాదు లో
ది: 3-3-2009న చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు)
Read more...
checkFull("post-" + "8865285997778820991");
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment